LOADING...
Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా గణేశ్‌ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత 
హైదరాబాద్‌లో జోరుగా గణేశ్‌ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత

Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా గణేశ్‌ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం దాదాపు 40 గంటల పాటు జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అంచనా. భద్రత కోసం 30 వేలకు పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు. అదనంగా 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా పనిచేస్తున్నారు. ప్రతి విగ్రహం తరలింపు వాహనానికి క్యూఆర్‌ కోడ్ జారీ చేయగా, ఇతర కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు కలర్‌ స్టిక్కర్లు అమర్చుతున్నారు. భద్రత పర్యవేక్షణ కోసం 250 తాత్కాలిక సీసీ కెమెరాలు, 9 డ్రోన్‌లతో గస్తీ నిర్వహిస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్ సిబ్బంది ప్రత్యేకంగా పనిచేస్తున్నారు.

Details

10 లక్షల మంది వచ్చే అవకాశం

ఎన్టీఆర్‌ మార్గ్‌లో అన్ని శాఖల అధికారుల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్ల పరిధిలో మౌంటెడ్‌ వాహనాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వంటి ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో మాత్రమే 3 వేలకు పైగా పోలీసులు నియమించారు. నిమజ్జనం సాఫీగా జరగేందుకు 40 క్రేన్‌లను ఏర్పాటు చేశారు. ఈ వేడుకను వీక్షించేందుకు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. నగరంలో ఆదివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిమజ్జనం సమయంలో ఆర్టీసీ బస్సులను మళ్లిస్తున్నారు.

Details

65 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు

ప్రైవేటు బస్సులకు నగరంలోకి ప్రవేశం లేదు. 65 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విగ్రహాలను మోసే వాహనాలు ఎక్కడైనా మొరాయిస్తే, మరమ్మత్తుల కోసం 55 చోట్ల ఆర్టీసీ మెకానిక్‌లను సిద్ధంగా ఉంచారు. అలాగే ప్రధాన జంక్షన్ల వద్ద బ్రేక్‌డౌన్ వాహనాల కోసం క్రేన్‌లు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 6 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్‌ 7 రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. రద్దీ సమయాల్లో ఆర్టీసీ బస్సులకు మెహదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే అనుమతిస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్-ప్యారడైజ్‌ మార్గాన్ని ఉపయోగించాలంటూ పోలీసులు సూచించారు.