Tamil Nadu Sexual Assault: విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోలీసుల ఎన్‌కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన స్నేహితుడితో కలిసి కారులో మాట్లాడుకుంటున్న ఓ కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం — కోయంబత్తూర్ (Coimbatore) అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి ఆ విద్యార్థిని తన ప్రియుడితో కారులో కూర్చొని మాట్లాడుకుంటోంది. అప్పుడు అక్కడికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చేరుకున్నారు. వారితో విద్యార్థిని, ఆమె స్నేహితుడు వాగ్వాదానికి దిగడంతో కోపోద్రిక్తులైన నిందితులు తమ వద్ద ఉన్న కొడవలితో యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను స్పృహ కోల్పోయాడు.
Details
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశం
అనంతరం ఆ ముగ్గురు ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి, నిర్జన ప్రాంతంలో వదిలేసి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన ఆ యువకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పీళమేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపులో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితుల ఆచూకీ లభించింది. అయితే వారు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి కాళ్లపై గాయపరిచారు. అనంతరం వారిని అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది. కోయంబత్తూర్‌లో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.
Details
మహిళల భద్రతలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
మహిళల భద్రతలో ద్రవిడ మోడల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ''కళాశాల విద్యార్థిని లైంగిక దాడికి గురవడం మనసును కలచివేసింది. గతేడాది అన్నా యూనివర్శిటీలో 19 ఏళ్ల యువతిపై జరిగిన దారుణం మరువకముందే మళ్లీ ఇలాంటి ఘటన జరగడం రాష్ట్రంలో భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని చూపిస్తోంది. తమిళనాడులో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి..? ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.