LOADING...
LPG Gas: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. రూ.29 పెరిగిన డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. రూ.29 పెరిగిన డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర

LPG Gas: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. రూ.29 పెరిగిన డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు మరోసారి గ్యాస్‌ ధరల షాక్‌ తగిలింది. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.29 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.913 నుంచి రూ.942కు పెరిగింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. గత మూడు నెలల వ్యవధిలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటికే ఈ ఏడాది మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.60 మేర పెంచారు.

వివరాలు

వినియోగదారులపై అదనపు భారం

తాజాగా మరోసారి ధరలు పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగే అవకాశముందనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపించాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్‌-ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తినా, అప్పటివరకు గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచలేదు. అయితే ప్రభుత్వం మే 1న వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచింది. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.993 మేర, ఐదు కిలోల సిలిండర్‌ ధరను రూ.261 మేర పెంచింది. అనంతరం జూన్‌ 1న మరోసారి వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.42 పెంపు అమలు చేసింది.

వివరాలు

గ్యాస్ కొరత లేదు

ఇదిలా ఉండగా, ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై వస్తున్న ఆందోళనలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల మధ్య కూడా ఏ రిటైల్‌ గ్యాస్‌ ఏజెన్సీ నుంచి గ్యాస్‌ కొరతపై ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. అలాగే ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement