Maharastra: కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్.. నగరం అంతటా రసాయన పొగ
మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ జరిగి నగరం మొత్తం రసాయన పొగ వ్యాపించింది. దీనివల్ల ప్రజలు కళ్లలో మంట, గొంతు నొప్పిని అనుభవిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ పొగలు వ్యాపించడంతో నగర పరిస్థితి తీవ్రంగా మారింది. థానే అగ్నిమాపక దళం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన గురువారం అర్థరాత్రి (సెప్టెంబర్ 12, 2024) చోటుచేసుకుంది.
కెమికల్ కంపెనీలో గ్యాస్ లీకేజీ
అంబర్‌నాథ్‌లోని ఓ రసాయన కంపెనీ నుంచి గ్యాస్ లీకేజీ జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోరివలి ఎంఐడీసీలోని ఒక కెమికల్ కంపెనీలో గ్యాస్ లీకేజీ జరిగింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలంలో గ్యాస్ స్వభావం,లీకేజీ కారణాన్ని గుర్తించేందుకు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేదా మృతి గురించి సమాచారం లేదు. ప్రజలకు ఇళ్ల నుండి బయట రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.