ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. గేట్‌వే ఆఫ్ ఇండియా ముఖ ద్వారంలో పగుళ్లతోపాటు గోపురాల్లో వాటర్‌ఫ్రూఫింగ్, సిమెంట్ కాంక్రీట్ పెచ్చలూడుతున్నట్లు స్ట్రక్చరల్ ఆడిట్ రిపోర్టు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వివరించింది. దాదాపు 100 ఏళ్ల నాటి ఈ స్మారక చిహ్నం మరమ్మత్తు కోసం ప్రతిపాదించిన రూ.8 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామమని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ హామీ ఇచ్చారు.
2006లో గేట్‌వే ఆఫ్ ఇండియాకు చివరి మరమ్మతులు
అరేబియా సముద్రం ఎదురుగా వందేళ్ల క్రితం గేట్‌వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. ఇది గ్రేడ్-I వారసత్వ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర పురావస్తు, మ్యూజియంల డైరెక్టరేట్ సుమారు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబా సంయుక్తంగా గేట్‌వే ఆఫ్ ఇండియా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం నిధులను విడుదల చేస్తామని చెప్పింది. గేట్‌వే ఆఫ్ ఇండియా చివరి మరమ్మతులు 2006లో జరిగాయి. మరమ్మతులకు ఏడాది సమయం పడుతుందని, వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబా పేర్కొన్నారు.