Page Loader
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం

వ్రాసిన వారు Stalin
Mar 01, 2023
06:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు అదును కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి తెలంగాణ బయట ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు బాల్క సుమన్, జోగు రామన్న, గోడం నగేష్‌లతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను వారికి అప్పగించారు.

బీఆర్ఎస్

హోలీ తర్వాత బీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం

మహారాష్ట్రలోని ప్రతి సెగ్మెంట్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన పార్టీకి అది పెద్ద సాహసమే అని చెప్పాలి. హోలీ పండుగ తర్వాత మహారాష్ట్రలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని, ఓట్లను పొందేందుకు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని బాధ్యతలు అప్పగించిన బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2-3 నియోజకవర్గాలకు ఒక బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిని సీఎం కేసీఆర్ ఇప్పటికే నియమించారు.