తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్
ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే తమ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2028 నాటికి రాష్ట్రం 100 బిలియన్ డాలర్లకు (8.2 లక్షల కోట్లు) చేరుకోవాలని లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు. అయితే ఇది ఇప్పటికే 80 బిలియన్ డాలర్లకు (రూ. 6.56 లక్షల కోట్లు)కు చేరుకుందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని 2025 నాటికి సాధించగలమనే నమ్మకం తమకు ఉందన్నారు. రాష్ట్ర ఫ్లాగ్‌షిప్ ఇండస్ట్రీ ఈవెంట్ 'బయోఏషియా 2023' 20వ ఎడిషన్‌ను శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్
తెలంగాణతో పాటు భారతదేశంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధిలో బయోఏషియా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ అత్యుత్తమ ప్లాట్‌ఫారమ్ 100కంటే ఎక్కువ దేశాల నుంచి ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థలను స్థిరంగా ఆకర్షిస్తోందని ఆయన చెప్పారు. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్‌ను 'వన్ ఫర్ వన్: షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్'గా కేటీఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను గుర్తించడంలో తెలంగాణ ముందుందని కేటీఆర్ చెప్పారు. గత 7సంవత్సరాలలో రాష్ట్రం 3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర కొత్త పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలో మొత్తం 4.5 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని వివరించారు.