GBS outbreak: మహారాష్ట్రలో 163కి చేరుకున్న జీబీఎస్ కేసులు.. 47 మంది ఐసీయూలో,వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పూణే నగరాన్ని ఒక అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. తాజాగా, అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో మరో ఐదుగురిని గుర్తించారు.
ఈ ఘటనతో మహారాష్ట్రలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) అనుమానిత కేసుల సంఖ్య 163కి చేరింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని వెల్లడించారు.
వివరాలు
47 మంది ఐసియులో
తాజాగా జీబీఎస్ (Guillain-Barré Syndrome) కారణంగా ఎవరూ మరణించకపోయినా, సోమవారం మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి తెలిపారు.
మొత్తం 127 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆయన వెల్లడించారు.
పూణే నగరంలో 32, పూణే మునిసిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా అనుసంధానించిన గ్రామాల నుండి 86, పింప్రి-చించ్వాడ్‌లో 18, పూణే గ్రామీణ ప్రాంతంలో 19, ఇతర జిల్లాల్లో ఎనిమిది కేసులు నమోదు కాగా, మొత్తం అనుమానిత కేసుల సంఖ్య 163కి చేరిందని ఆయన వివరించారు.
ఈ 163 మంది రోగుల్లో 47 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని, 47 మంది ఐసియులో చికిత్స పొందుతుండగా, 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆయన వెల్లడించారు.
వివరాలు
క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం
పూణే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మొత్తం 168 నీటి నమూనాలను రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపించామని ఆయన తెలిపారు.
ఈ నమూనాల్లో ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్లు తేలిందని వెల్లడించారు.
గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) ఒక అరుదైన వ్యాధి. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ అవయవాలు ఆకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి, కండరాలు బలహీనపడతాయి.
చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత ఏర్పడుతుంది. నిపుణుల ప్రకారం, కలుషితమైన ఆహారం, నీటిలో ఉండే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని తెలిపారు.