
GCC: హైదరాబాద్‌లో ప్రతి 10 రోజులకో జీసీసీ 'ఎక్స్‌ఫీనో' నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో కొత్తగా స్థాపించబడుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCCs)ఆకర్షించడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోందని మానవ వనరుల సేవల సంస్థ ఎక్స్‌ఫీనో తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి 10 రోజులకు ఒక కొత్త జీసీసీ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పడుతోందని ఆ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్‌ను తమ కార్యకేంద్రంగా ఎంచుకుంటున్నాయని పేర్కొంది. ఈ సంస్థ విశ్లేషణ ప్రకారం, వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు, నాయకత్వ నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు,అత్యుత్తమ ప్రతిభా వనరులు అందుబాటులో ఉండటమే జీసీసీలను హైదరాబాద్ వైపు ఆకర్షించే ప్రధాన కారణాలుగా మారాయి. మౌలిక వసతులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక విధానాలు కూడా ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని ఎక్స్‌ఫీనో నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
జీసీసీల పెరుగుదలలో హైదరాబాద్ ఆధిపత్యం
గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఏర్పాటైన కొత్త జీసీసీలలో 40శాతం హైదరాబాద్‌లో, 33శాతం బెంగళూరులో స్థాపించబడ్డాయని నివేదిక తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న 360జీసీసీలలో సుమారు 3.1లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలోని వైట్-కాలర్ ఉద్యోగాల్లో 14 శాతంగా ఉందని వెల్లడించింది. జీసీసీ ఉద్యోగులలో 33 శాతం మహిళలు ఉండగా, వారిలో 19 శాతం నాయకత్వ స్థానాల్లో ఉన్నారని నివేదిక వివరించింది. అలాగే, జీసీసీల్లో పనిచేస్తున్న ఉద్యోగులలో 57 శాతం ఇంజినీరింగ్, ఐటీ రంగ నిపుణులే అని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యాలతో ఉన్నవారి సంఖ్య 47.8 లక్షలుగా నమోదైంది. అందులో 2.3 లక్షల మందికి ఒక సంవత్సరానికి పైగా ఉద్యోగ అనుభవం ఉందని నివేదికలో పేర్కొంది.
వివరాలు
ఇతర రాష్ట్రాలకంటే హైదరాబాద్‌కే అధిక ఆకర్షణ
నివేదిక ప్రకారం, వైట్-కాలర్ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఉద్యోగుల సంఖ్య, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కంటే చాలా ఎక్కువగా ఉందని తేలింది. తక్కువ జీవన వ్యయం, సాంకేతిక, సాంకేతికేతర పరిశ్రమల విస్తృతి వంటి అంశాలు హైదరాబాద్‌ను ఇతర మెట్రో నగరాల కంటే ముందంజలో నిలిపాయి అని ఎక్స్‌ఫీనో సీఈఓ ఫ్రాన్సిస్ పదమాదన్ పేర్కొన్నారు.
వివరాలు
ఇది బెంగళూరు సంస్థ
బెంగళూరును కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎక్స్‌ఫీనో, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో మానవ వనరుల సేవలను అందిస్తోంది. గత 8 సంవత్సరాల్లో జీసీసీలు,పెద్ద ఐటీ కంపెనీలకు 28,000 మంది నిపుణులను ఎంపిక చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. ఇటీవలి కాలంలో భారత్‌లో స్థాపించబడుతున్న కొత్త జీసీసీలకు కూడా ఎక్స్‌ఫీనో సంస్థ మానవ వనరుల నియామక సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది.