
TGSRTC: గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కిన బస్సు కదలికలు, స్టాప్ డిటెయిల్స్.. కేవలం మీ మోబైల్‌లోనే తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాణికులకు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో ఎక్కిన తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం ఎంత దూరంలో ఉందో, ఇంకా ఎన్ని స్టాప్‌లు మిగిలి ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ (Google Maps) సాయంతో సులభంగా తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా క్యూఆర్ ఆధారిత డిజిటల్ బస్సు పాస్‌లు, టికెట్ వివరాలు ప్రయాణికుల స్మార్ట్‌ఫోన్‌లోనే చూసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇప్పటికే టీజీఎస్‌ఆర్టీసీ 'గమ్యం' పేరిట ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ యాప్‌లో బస్సు బయలుదేరిన సమయం, ప్రస్తుత స్థానంతో పాటు, ప్రయాణ మార్గం వంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Details
ఆర్టీసీ డేటాను గూగుల్ కు అందజేసే అవకాశం
అయితే ఆ యాప్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ సదుపాయాలను గూగుల్ మ్యాప్స్‌తో సమన్వయం చేసి మరింత కచ్చితంగా అందించాలనే నిర్ణయానికి ఆర్టీసీ వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే ఆర్టీసీ బస్సుల డేటాను గూగుల్‌కు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి రానుంది.ప్రయాణికులు రెండు వారాల్లోపే తమ బస్సు స్థానం, గమ్యం, చేరుకునే సమయం వంటి వివరాలను రియల్‌టైమ్‌లో తెలుసుకోగలరు. తర్వాతి దశలో తెలంగాణ రాష్ట్రంలోని మిగతా బస్సుల సమాచారం కూడా గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరచనున్నారు. దీంతో ప్రయాణికులు ఏ బస్సు ఎక్కడుందో, ఎప్పుడు తమ స్టాప్‌కు చేరుకుంటుందో, టికెట్, పాస్ వివరాలను కూడా మొబైల్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు.