
Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్.. గీతం ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్‌ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఐ. శరత్‌బాబు 'మోనోఫ్లోరల్ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.
సంప్రదాయ పద్ధతుల్లో సేకరించే ఈ సహజ వనరుకు శాస్త్రీయత, సాంకేతికతలు జోడించి, నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలు
సైన్స్ & టెక్నాలజీ హబ్స్ ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగం (DST), గీతం సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరులో రూ.3.64 కోట్ల వ్యయంతో 4 సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 30 గ్రామాలకు చెందిన 250 మంది గిరిజనులకు తేనె సేకరణపై శిక్షణ ఇచ్చి, మార్కెటింగ్ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు.
శాస్త్రీయ విధానాలతో తేనె ఉత్పత్తి
రైతులకు శాస్త్రీయంగా తయారుచేసిన వలిసె విత్తనాలను అందించి,తగిన విధంగా సాగు చేయిస్తున్నారు.
ఆ పొలాల్లో ఏడాది పొడవునా సీజన్ ప్రకారం అంతర పంటలు పండిస్తున్నారు.
తేనెటీగల పెంపకానికి వీలుగా తగిన తేనెలు ఇచ్చే మొక్కలు పెంచి,తేనెటీగలకు అవసరమైన మకరందాన్ని అందిస్తున్నారు.
వివరాలు
త్వరలో ఆన్‌లైన్ విక్రయాలు
ప్రతి యూనిట్‌లో ఆటోమేటిక్ మాయిశ్చర్ కంట్రోల్, ఉష్ణోగ్రత నియంత్రణ, ఫిల్టరేషన్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా తేనెను శుద్ధి చేసి, 18 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తొలి ఏడాదిలోనే 500 కిలోలకుపైగా తేనె సేకరించి విక్రయించారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ-కామర్స్ వేదికగా తేనెను విక్రయించాలని నిర్ణయించారు.
దీనివల్ల అరకు కాఫీ మాదిరిగా ఈ తేనెకు కూడా ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపు లభించనుంది.
2027 నాటికి ప్రతి ఏడాది రూ.1 కోట్ల విలువైన తేనెను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
4,000 మందికి ఉపాధి
ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ఒక్కో కుటుంబానికి నెలకు రూ.20,000కుపైగా ఆదాయం వస్తోంది.
గిరిజనులు సేకరించే ఉత్పత్తులకు శాస్త్రీయత, సాంకేతికతలు జోడించి మార్కెటింగ్ చేయడం ద్వారా అధిక డిమాండ్ ఏర్పడుతుందని, త్వరలోనే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్‌ను (FPOs) ఏర్పాటు చేసి, బాధ్యతలను వారి చేతిలో పెట్టనున్నట్లు ప్రాజెక్టు నిర్వాహకుడు డాక్టర్ శరత్‌బాబు తెలిపారు.