
Andhra Pradesh: చెత్త ఇచ్చి వస్తువులు పొందండి.. స్వచ్ఛాంధ్ర కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజలకు ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా జీవించే అవకాశాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ దిశగా, కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడో శనివారం మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో నిర్వహిస్తూ ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్నారు. ఇక ఇప్పుడు, అదే ఉద్యమాన్ని గ్రామాల దాకా విస్తరించాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాలను పరిచయం చేశారు.
Details
స్వచ్ఛ రథం.. పల్లెల్లో శుభ్రతకు కొత్త దిశ
వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చెత్త, వ్యర్థాలను సేకరిస్తారు. ప్రజలు ఇవ్వు చెత్త పరిమాణాన్ని లెక్కగట్టి, దానికి తగిన రీతిలో 20 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తారు. ఈ ప్రణాళిక పైలట్ ప్రాజెక్టుగా గుంటూరు గ్రామీణ మండలంలో అమలులోకి వచ్చింది. అందులో భాగంగా లాలుపురం పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ హెని క్రిస్టినా పాల్గొన్నారు. ఈ విధంగా చెత్తకు ప్రతిఫలంగా ఉపయోగకరమైన వస్తువులు ఇవ్వడం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై ఆసక్తి, చొరవ పెంచుతున్నారు. గ్రామీణ స్థాయిలో వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడానికి ఇది ఒక మోడల్ ప్రాజెక్టుగా మారే అవకాశముంది. స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో పల్లెలు కూడా కీలక భాగస్వాములవుతాయి.