IndiGo Flight: గాల్లో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. గోవాకు వెనుదిరిగిన ఇండిగో
ఈ వార్తాకథనం ఏంటి
గోవా నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య ఎదురైంది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి గోవా వైపు మళ్లించారు. ఈ పరిణామాన్ని గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కొద్దిసేపు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే విమానం ఎలాంటి ఇబ్బంది లేకుండా గోవా విమానాశ్రయంలో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఇండిగోకు చెందిన 6ఈ 2102విమానం మంగళవారం ఉదయం 9:16గంటలకు గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన పైలట్లు విమానాన్ని గోవా దిశగా తిప్పారు. ఉదయం 9:30గంటల సమయంలో ఏటీసీ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
వివరాలు
14 వేల అడుగుల ఎత్తు నుంచి గోవాకు వెనుదిరిగిన ఇండిగో
విమానం దక్షిణ మహారాష్ట్ర తీర ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో వెనక్కి మళ్లినట్లు ఫ్లైట్ రాడార్24 డేటా వెల్లడించింది.
ఆ సమయంలో విమానం సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు సమాచారం.
గోవా వైపు తిరిగిన విమానం ఉదయం 9:51 గంటలకు రన్‌వే 28పై సురక్షితంగా ల్యాండ్ అయింది.
అనంతరం దాన్ని స్టాండ్ 6 వద్ద పార్కింగ్ చేశారు. దీంతో ఉదయం 10:03 గంటలకు ఏటీసీ ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించింది.
వివరాలు
ప్రయాణికులు సురక్షితం.. ఢిల్లీ ప్రయాణం రీషెడ్యూల్
విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు వచ్చారు.
అనంతరం వారిని బోర్డింగ్ ప్రాంతానికి తరలించారు. ఢిల్లీ వెళ్లాల్సిన ఈ విమాన ప్రయాణాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
విమానం ప్రయాణానికి పూర్తిగా అనుకూలంగా ఉందని అధికారులు నిర్ధారించిన తర్వాతే దాన్ని తిరిగి ఢిల్లీకి నడపనున్నారు.
అయితే విమానం ఇంజిన్‌లో ఖచ్చితంగా ఎలాంటి సమస్య తలెత్తిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.