Loading...
Godavari: గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం.. డెల్టా సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన
గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం.. డెల్టా సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన

Godavari: గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం.. డెల్టా సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి ఏడాది ఈ కాలంలో వరద నీటితో ఉప్పొంగే గోదావరి నది ఈసారి వెలవెలబోతోంది. సాధారణంగా ఎర్రటి వరద జలాలతో కళకళలాడే గోదారిలో ప్రస్తుతం ఇసుకతిన్నెలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం కారణంగా గత ఏడు దశాబ్దాల్లో కనిపించని స్థాయిలో నదిలోకి నీటి ప్రవాహం తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్టణం జిల్లాలకు సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ప్రధాన ఆధారమైన గోదావరి ఈసారి ఆశించిన స్థాయిలో నీటిని అందించలేకపోతోంది. అయితే గోదావరి డెల్టా పరిధిలోని 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

ఏలేరు జలాశయంలో పరిమిత నిల్వలు

అయితే ఏలేరు జలాశయం, ఇతర రిజర్వాయర్లు, పుష్కర ఎత్తిపోతల పథకం తదితరాల పరిధిలోని దాదాపు 2 లక్షల ఎకరాలకు అవసరమైన నీటి లభ్యతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు.

కాకినాడలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఏలేరు జలాశయం పరిధిలోని సుమారు 53వేల ఎకరాలకు రోజుకు 1,000క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం జలాశయంలో మొత్తం 8.20 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

ఇందులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కావడంతో అదే నిల్వలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

సీలేరు జలాలపై ఆశలు

మరోవైపు గోదావరిలోకి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పంపులతో నీటిని ఏలేరు జలాశయం, పుష్కర పథకం, ఇతర రిజర్వాయర్లు, మున్సిపల్ చెరువులకు తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు.

సాధారణంగా ప్రతి రబీ సీజన్‌లో సీలేరు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీటితో పాటు అవసరాన్ని బట్టి బైపాస్ ద్వారా 10 నుంచి 30 టీఎంసీల వరకు నీటిని వినియోగిస్తారు.

తూర్పు,పశ్చిమ,మధ్య డెల్టా ప్రాంతాలకు సాగునీరు అందించాలంటే రోజుకు సుమారు 14,700 క్యూసెక్కుల నీటి అవసరం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

జూన్ నుంచి 101 టీఎంసీలే

అయితే ఈ ఏడాది గోదావరిలోకి ఆ స్థాయిలో ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఈ నెలలో ఐదు రోజుల పాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బైపాస్ ద్వారా నీటిని తరలించాల్సి వచ్చింది.

ప్రస్తుతం విద్యుదుత్పత్తి అనంతరం సగటున రోజుకు 3 వేల క్యూసెక్కుల మేర మాత్రమే నీరు అందుతోంది.

గత సంవత్సరాల్లో ఇదే సమయానికి జులై నెలలో గోదావరిలో 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం నమోదయ్యేది.

కానీ ప్రస్తుతం వేల క్యూసెక్కుల స్థాయిలో మాత్రమే నీటి ప్రవాహం కొనసాగుతోంది.

జూన్ నెల నుంచి ఇప్పటి వరకు గోదావరిలో మొత్తం 101 టీఎంసీల నీరు మాత్రమే చేరింది.

ADVERTISEMENT

వివరాలు 

కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు 15 వేల క్యూసెక్కుల నీటి విడుదల

ఇందులో 57 టీఎంసీలను డెల్టా ఆయకట్టుకు వినియోగించగా, మరో 44 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు.

మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో జులైలో కేవలం ఒక్కరోజు మాత్రమే గరిష్ఠంగా 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అనంతరం ప్రవాహం మళ్లీ తగ్గిపోయింది.

ఈ నెలలో సగటున రోజుకు 34 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అందులో దాదాపు 15 వేల క్యూసెక్కుల నీటిని ప్రతిరోజూ కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు.

వివరాలు 

వర్షాభావంతో పెరిగిన నీటి అవసరం

డెల్టా ప్రాంత రైతులు సాధారణంగా సాగునీటి కోసం 30 శాతం వర్షాలపై, 70 శాతం కాలువల ద్వారా వచ్చే నీటిపై ఆధారపడుతుంటారు.

మొత్తం 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే సుమారు 130 టీఎంసీల నీరు అవసరం.

అయితే ఈ ఏడాది వర్షాభావం కారణంగా మరో 10 టీఎంసీల అదనపు నీటి అవసరం ఏర్పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయినప్పటికీ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ డెల్టా రైతులకు సాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT