LOADING...
Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి 
త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి

Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ హిందూ సంప్రదాయంలో నదులు దైవ స్వరూపాలుగా భావించబడతాయి. వాటిని పూజించడం, నదుల్లో స్నానాలు చేసి పుణ్యం పొందాలనే ఆచారం ఎన్నో యుగాలుగా నడుస్తూ వస్తోంది. ముఖ్యంగా"పుష్కరాలు"అదే కోవలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా 12 పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. బృహస్పతి గ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తే, దానికి అనుగుణంగా ఆ నదికి పుష్కరాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా,బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో,2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కర మహోత్సవాలను జరపడానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి 12 ఏళ్లకూ ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

వివరాలు 

2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ప్రత్యేకతలు 

ఈసారి జరిగే గోదావరి పుష్కరాలు అనేక విశేషాలతో నిలవనున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం,దాదాపు 8కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాల కోసం రానున్నారు. ఈ అంచనాకు తగినట్లు ఘాట్ల అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2015లో రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల ప్రారంభ వేడుకలో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని,భక్తుల భద్రత,సౌకర్యాల దృష్ట్యా ఈసారి మరింత సమగ్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఒకే ఘాట్‌కు పరిమితం కాకుండా,గోదావరి నదిలో ఏ ప్రాంతంలోనైనా స్నానాలు చేయవచ్చని ప్రచారాన్ని జరిపేందుకు అధికారులు భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధికి రాష్ట్ర యంత్రాంగం ₹904కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వివరాలు 

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపు 

అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ₹100కోట్ల నిధులను ముందస్తుగా కేటాయించింది. గోదావరి పుష్కరాల సందర్బంగా రైల్వే శాఖ కూడా విశేష చర్యలు చేపట్టింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ₹271.43 కోట్ల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ముఖ్య కేంద్రాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్ల వివరాలను ముందుగానే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

వివరాలు 

పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష 

2027 పుష్కరాల కోసం "అఖండ గోదావరి పుష్కరాలు" పేరుతో ముసాయిదా యాక్షన్ ప్లాన్ రూపొందించబడింది. ప్రస్తుతం ఏపీలో గోదావరి నది తీరంలోని 17 ప్రధాన ఘాట్లకు రోజూ సగటున 75 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో ఉన్న ఘాట్లకు అదనంగా నలుగు కొత్త ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం పరిధిలోని ఘాట్ల అభివృద్ధికి ప్రత్యేకంగా ₹904 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించబడింది.

వివరాలు 

రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి కూడా నిధుల ప్రణాళిక 

కార్పొరేషన్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ₹456.5 కోట్లతో, ఆర్‌అండ్‌బీ (రహదారి, భవనాలు) శాఖ ద్వారా రహదారులు, వంతెనల నిర్మాణానికి ₹678.76 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తంగా చూస్తే, గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమిష్టిగా ప్రణాళికలు రూపొందిస్తూ, తగిన నిధుల సమీకరణకు సన్నద్ధమవుతున్నారు.