Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువన పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరిగి, మంగళవారం ఉదయానికి 45 అడుగులను దాటింది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం, భద్రాచలం వద్ద 9 లక్షల 46 వేల 412 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతోంది. వ రద మరింత పెరిగే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
48 అడుగులకు చేరినప్పుడు, రెండో ప్రమాద హెచ్చరిక
భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి. గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరి వరద స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. సోమవారం నుండి లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రవాహం 48 అడుగులకు చేరినప్పుడు, రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.