Census: సహజీవన జంటలకు గుడ్‌న్యూస్.. జనగణనలో కుటుంబ హోదా ఇవ్వనున్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, జనాభా లెక్కల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఈసారి సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా కల్పించాలని నిర్ణయించింది. చాలాకాలంగా కలిసి నివసిస్తున్న వారిని ఒకే కుటుంబంగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఇది దేశంలో 16వ జనగణనగా ఉండనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండు దశల్లో దీన్ని అమలు చేయనున్నారు. తొలి దశలో గృహ గణన చేపట్టి అధికారులు మొబైల్ యాప్ సాయంతో ఇంటింటికీ వెళ్లి ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది.
వివరాలు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం
ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు లేనివిధంగా ఈసారి ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించింది. జనగణన కోసం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించారు. ఈ ప్రక్రియలో ఇంటి యజమాని వివరాలు, వ్యక్తిగత సమాచారం, కులం, కమ్యూనిటీ వివరాలు సేకరిస్తారు. ఇంట్లో నివసిస్తున్న వారి సంఖ్య, వారి వయస్సు వంటి అంశాలను కూడా నమోదు చేస్తారు. అదనంగా, ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, బైక్, కారు, జీప్, వ్యాన్) గృహోపకరణాలు (రేడియో, టీవీ) యాజమాన్యం గురించి కూడా అడుగుతారు.
వివరాలు
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన
ఇంకా తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సదుపాయాలు, వంటకు ఉపయోగించే ఇంధనం వంటి అంశాలపై కూడా సమాచారం సేకరించనున్నారు. మన దేశంలో సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియ పూర్తైంది. కోవిడ్-19 ప్రభావంతో 2021లో నిర్వహించాల్సిన జనగణన వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైంది.