Shrikant Purohit: కర్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు గుడ్ న్యూస్.. బ్రిగేడియర్‌గా ప్రమోషన్
ఈ వార్తాకథనం ఏంటి
లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 2008లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో పురోహిత్‌పై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ముంబయిలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు గతేడాది ఈ కేసులో ఉన్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయనకు పదోన్నతి లభించింది. పదోన్నతి, సేవా ప్రయోజనాల కోసం పురోహిత్ సాయుధ దళాల ట్రిబ్యునల్ (AFT)ను ఆశ్రయించారు. మాలేగావ్ కేసు విచారణ చాలా కాలం కొనసాగడం వల్ల తన కెరీర్ పురోగతిపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాలు
రిటైర్మెంట్‌ను నిలిపివేయాలంటూ ఆదేశాలు
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఈ ఏడాది మార్చి 31న జరగాల్సిన ఆయన పదవీవిరమణపై AFT స్టే విధించింది. అంతేకాకుండా రక్షణ శాఖకు నోటీసులు జారీ చేస్తూ.. ఆయన ఫిర్యాదుపై తుది నిర్ణయం తీసుకునే వరకు రిటైర్మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ఆయనకు బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించింది.
వివరాలు
100 మందికి పైగా గాయాలు
ఇక మాలేగావ్ పేలుడు ఘటన 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌తో పాటు శ్రీకాంత్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం ఎన్‌ఐఏ కోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.