
Mega DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. తుది కీ, వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మెగాడీఎస్సీ-2025 పరీక్షలు గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించారు. ఈపరీక్షల అనంతరం వివిధ సబ్జెక్టుల ప్రాథమిక 'కీ'తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల చేయడం జరిగింది. తాజాగా, ఈ డీఎస్సీ ప్రక్రియలో మరో కీలక అప్‌డేట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ అధికారుల ప్రకారం, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సబ్జెక్టుల వారీగా తుది 'కీ'ను జూలై 25న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈతుది కీ ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ను నిర్ధారించి తదుపరి దశలకు అడుగులు వేయనున్నారు. తుది కీ విడుదల తరువాత ఎంపిక ప్రక్రియ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను వచ్చే నెల ఆగస్టు 25వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
Details
ఆగస్టు 25లోగా పూర్తి చేయనున్న ఎంపిక ప్రక్రియ
ఈ దశలో ఎంపిక ప్రక్రియను 1:1 నిష్పత్తిలో నిర్వహించనున్నారు. అంటే, ప్రతి ఖాళీ పోస్టుకు ఒక్క అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా తాము అర్హులని నిరూపించే విద్యా అర్హతలు, స్థానికత (నేటివిటీ), రిజర్వేషన్ హక్కులు, ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు సమర్పించాలి. ఎవరైనా అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే లేదా అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోతే, తక్కువ మెరిట్ ఉన్న మరో అర్హుడు ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక తుది ఎంపిక, నియామక ప్రక్రియ పూర్తవగానే నియామక ఉత్తరాలు జారీ చేసే దిశగా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వ ప్రకటనలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.