Crop loan: రైతులకు శుభవార్త.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం
రైతుల పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం అందించే రుణ పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా, ఈ పరిమితిని తాజాగా రూ.2 లక్షలకు పెంచుతూ ప్రకటన చేసింది. 2024 జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రైతులు వ్యవసాయ పెట్టుబడులు, పంట సాగుకు అధిక ఖర్చులు చేస్తుండటంతో పాటు, ద్రవ్యోల్బణం పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఆర్ బి ఐ ఈ నిర్ణయం తీసుకుంది.
రూ.10వేలు నుంచి రూ.2లక్షల వరకు
2004లో కేవలం రూ.10,000గా ఉన్న ఈ రుణ పరిమితి, క్రమంగా పెరిగి, ఇప్పుడు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఆర్ బి ఐ నిబంధనల ప్రకారం, భూమి యజమానుల నుంచి ఎలాంటి తాకట్టు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధన అమలవకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీతో రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. దీన్ని నివారించడంలో ఆర్‌బీఐ నిర్ణయం కీలకంగా నిలుస్తుంది. వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిర్ణయం ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మంది నేరుగా లాభపడతారు.
రైతులకు ఆర్థిక భద్రత
దీనివల్ల రైతుల ఆర్థిక భద్రత మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాల అమలులో బ్యాంకులు దృష్టి సారించాలని సూచించింది. రైతులకు ఈ మార్పులపై విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, రుణ మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేసింది. ఇది రైతుల జీవనోపాధిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
రుణానికి దరఖాస్తు చేసే విధానం
1. బ్యాంకుకు వెళ్లి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని పొందండి. 2. మీ వ్యవసాయ భూమికి సంబంధించిన ఆధార పత్రాలు సమర్పించండి. 3. తగిన విధంగా మీ రుణ అవసరాలను వివరించండి. 4. బ్యాంకు అధికారులు రుణ ప్రాసెసింగ్‌ను పూర్తి చేసిన తర్వాత రుణం మంజూరు చేస్తారు.