రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఇది దాదాపు 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటులో 96 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు.
జూన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశించినున్న రుతుపవనాలు
భారతదేశం అంతటా కోట్లాది మంది రైతులు తమ పొలాలను వార్షిక రుతుపవనాలపై ఆధారపడి సాగు చేసుకుంటారు. ఐఎండీ అంచనా వేసినట్లు వర్షాలు పడితే వరి, సోయాబీన్స్, మొక్కజొన్న, చెరకు వంటి పంటల ఉత్పత్తి పెరుగుతుంది. ఆహార ధరలు తగ్గడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండటానికి దోహదపడుతుంది. రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, దాని ప్రభావం ద్వితీయార్ధంలో ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. అన్ని ఎల్ నినోలు చెడ్డవి కావని పేర్కొంది. ఎల్ నినో అనేది మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలం వేడెక్కే దశను సూచిస్తుంది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ దక్షిణ కొనపై కురిసే వర్షాలు, సెప్టెంబర్ నాటికి తిరోగమనం చెందుతాయని ఐఎండీ చెప్పింది.