Special buses: పండుగ ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి 1,500 స్పెషల్ ఆర్టీసీ బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి 1,500 అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌లో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చేందుకు ప్రతి సంవత్సరం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నామని ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రధాన గమ్యస్థానాలకు ఈ 1,500 అదనపు సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
Details
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. విశాఖపట్నం నగరంలో డిపో మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, రియల్ టైమ్ డిమాండ్‌ను బట్టి బస్సులు నడపాలని నిర్ణయించారు. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళా ప్రయాణికులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. పండుగ ప్రయాణం మొత్తం సజావుగా సాగేందుకు ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. పండుగకు ముందు ప్రయాణికుల అవసరాలను పూర్తిగా తీర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ తన సాధారణ సర్వీసులతో పాటు మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏ రూట్‌లోనూ పండుగ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు.
Details
జనవరి 12 నుంచి సర్వీసులు ప్రారంభం
సంక్రాంతి సందర్భంగా నడిచే ఈ స్పెషల్ సర్వీసులు జనవరి 12 నుంచే ప్రారంభమయ్యాయని, కనుమ పండుగ అనంతరం కూడా నాలుగు నుంచి ఐదు రోజులు వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు. పండుగ రద్దీ ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని, సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని కూడా మంత్రి తెలిపారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించి క్షేమంగా స్వగ్రామాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
Details
ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవు
సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పండుగ కానుకగా అభివర్ణించారు. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేసినట్లయితే సంబంధిత బస్సులను సీజ్ చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.