Hyderabad Metro: హైదరాబాదీలకు శుభవార్త.. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం?
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను తెల్లవారుజామునే ప్రారంభించాల్సిన అవసరంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ దృష్టి సారించారు. ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆయన కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రోజూ అనేక రైళ్లు వచ్చిపోతున్నాయని, వాటిలో ఎక్కువ భాగం ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలోనే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్‌లకు చేరుకుంటున్నాయని సంజయ్ కుమార్ వివరించారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వందే భారత్ సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా బయల్దేరుతున్నాయని తెలిపారు.
వివరాలు
గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
అయితే ఈ కీలక సమయాల్లో మెట్రో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగోల్, మియాపూర్, ఎల్‌బీనగర్ వంటి టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఉదయం 6 గంటలకే మెట్రో రైళ్లు ప్రారంభమవుతున్నప్పటికీ, అవి నాంపల్లి, సికింద్రాబాద్ వంటి ముఖ్య స్టేషన్‌లకు చేరుకునే సమయానికి దాదాపు అరగంటకు పైగా పడుతోంది. దీంతో ప్రయాణికులు ఈ స్టేషన్‌లకు చేరుకునే సమయానికి 6:30 నుంచి 6:45 అవుతుందని తెలిపారు. ఈ సమస్యపై గతంలో కూడా మెట్రో రైలు లిమిటెడ్ ఎండీకి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు
అయితే అప్పట్లో సాంకేతిక, నిర్వహణ సంబంధిత కారణాల వల్ల సమయాల్లో మార్పులు చేయడం సాధ్యం కాదని ఎల్‌అండ్‌టీ-హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్పందించినట్టు చెప్పారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జీఎం విజ్ఞప్తి చేశారు. రైల్వే జీఎం అభ్యర్థనపై తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.