Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే లైసెన్స్‌లు, ఆర్సీలు
ఈ వార్తాకథనం ఏంటి
వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలోని 61 ఆర్టీఓ కార్యాలయాల ద్వారా ఈ కార్డులు వాహనదారులకు పంపిస్తున్నారు. ఇకపై 'సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్' విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ప్రతేడాది సగటున సుమారు 4.70 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతుండగా, దాదాపు 9.90 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.
వివరాలు
తనిఖీల సమయంలో వాహనదారులు ఇబ్బందులు
ఈ రెండింటిని కలిపి సంవత్సరానికి 14 నుంచి 15 లక్షల కార్డులను వాహనదారులకు అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వీటి పంపిణీకి వారాలు, కొన్నిసార్లు నెలలు పట్టుతున్న పరిస్థితి ఉంది. గతంలో అవినీతి నిరోధక శాఖ చేసిన తనిఖీల్లో వందల సంఖ్యలో లైసెన్సులు, ఆర్సీలు ఏజెంట్ల వద్ద లభ్యమవడం గమనార్హం. మరోవైపు కార్డులు అందకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు చేసే తనిఖీల సమయంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కార్డులు ఏజెంట్ల వద్దకు వెళ్లకుండా నేరుగా వాహనదారుల ఇంటికే పంపే విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాలను సంప్రదించినప్పుడు, కార్డులు ఇప్పటికే పంపించామని అధికారులు చెబుతున్న సందర్భాలు ఉన్నాయి
వివరాలు
ప్రతేడాది 6,900 కోట్ల వరకు ఆదాయం
దీంతో పలువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకుని, తిరిగి డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఆయా ఆర్టీఓ కార్యాలయాల పరిధిలోనే ఆర్సీ, లైసెన్స్ కార్డులు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ముద్రణలో ఆలస్యం జరుగుతోంది. సెంట్రలైజ్డ్ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డుల ముద్రణ, పంపిణీ జరగనుంది. రవాణా శాఖకు పన్నులు, ఫీజుల ద్వారా ప్రతి ఏడాది రూ. 6,700కోట్ల నుంచి రూ. 6,900కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో సుమారు రూ.135కోట్లకు పైగా యూజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ యూజర్ ఛార్జీల మొత్తాన్ని రవాణా శాఖకే కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం.