Page Loader
Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ
రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ

Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

రుణమాఫీకి అర్హత కలిగిన కానీ రేషన్ కార్డు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాఫీ పొందని రైతుల వివరాలను సేకరించేందుకు రేపటి నుంచి వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించనుంది ఈ సర్వేలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, 'రైతు భరోసా పంట రుణమాఫీ యాప్' ద్వారా నమోదు చేస్తారు. ఈ కొత్త యాప్‌ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించారు. రుణమాఫీకి అర్హత ఉన్న కానీ మాఫీ పొందని రైతుల ఇళ్లకు వెళ్లి, క్షేత్రస్థాయి సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

Details

ప్రత్యేక యాప్ ను రూపొందించామన్న మంత్రి తుమ్మల

రైతుల నుండి ధ్రువీకరణ పత్రాలు సేకరించి, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం పొందాలని సూచించారు. ముందుగా కొంతమంది రైతుల వివరాలను యాప్‌లో నమోదు చేసి పరీక్షించమని ఆదేశాలు ఇచ్చారు. రేపటి నుండి సర్వే ప్రారంభమై, వివరాల నమోదు ప్రక్రియ యాప్ ద్వారా అమలు కానుంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా, రుణమాఫీ కాలేదని కొంతమంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.