Loading...
Bhogapuram Airport: ఉత్తరాంధ్రకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
ఉత్తరాంధ్రకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

Bhogapuram Airport: ఉత్తరాంధ్రకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఉత్తరాంధ్రకు మణిహారంగా మారడమే కాకుండా, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు

జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి

విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని, హైదరాబాద్‌లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి తరహాలోనే భోగాపురం పరిసర ప్రాంతాల్లో కూడా వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటాయని సీఎం చెప్పారు.

విమానాల రాకపోకలు ప్రారంభమైన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరిగి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.

విమానాశ్రయం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయం వంటి మౌలిక వసతులతో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

వివరాలు

అధికారులకు స్పష్టమైన అదేశాలు

ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

గిరిజన సంస్కృతి, హస్తకళలను ప్రతిబింబించే స్వాగత కార్యక్రమాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలు, సంస్కృతిని చాటిచెప్పేలా వేడుకలను కళాత్మకంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలు, విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులు విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, అందుబాటులోకి రానున్న వసతులపై సీఎంకు వివరించారు.

అలాగే విమానాశ్రయం ప్రారంభానికి అవసరమైన ఎనిమిది కీలక అనుమతులను ఇప్పటికే పొందినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT