TG Ration Cards: ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సిద్ధం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త రేషన్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు ప్రాతిపదికగా ఉండడంతో, ఈ కార్డుల కోసం ప్రజలు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కుటుంబాల విభజన, కొత్త సభ్యుల చేరిక వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో కొందరు సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. తాజా సమాచారంతో కొత్తగా పెళ్లైన వారికి కూడా మెట్టినింట్లో కార్డుల్లో చేర్చే అవకాశాలు ఉండనున్నాయి.
రేషన్ కార్డులకు భారీ డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ కార్డులు ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా గుర్తించేందుకు, కుటుంబ యజమానిగా మహిళల్ని గుర్తించే విధానంలో జారీ చేయాలని యోచిస్తున్నాయి. రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చిన తర్వాత, కొత్త రేషన్ కార్డుల జారీని చేపట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు భారీ డిమాండ్ ఉంది.
పెండింగ్ లో లక్షలాది దరఖాస్తులు
ఇప్పటికే లక్షలాది కుటుంబాలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అందులోనూ 11.08 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డులను జారీ చేసి, రేషన్ దుకాణాల్లో ప్రతి ఇంటికి ఎంత సరుకుకు అర్హత ఉందో తెలుసుకునే విధానంలో మార్పులు తీసుకువస్తున్నారని అధికారులు తెలిపారు.