Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకొనేలా మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ హామీని జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ అధికారుతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయనతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా, గోధముల పంపిణీ, రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. డీలర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, అయితే పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ప్రస్తుతం 6ఏ సెక్షన్ కింద ఫైన్ మాత్రమే వేస్తున్నారని, ఇక నుంచి డీలర్ షిప్ రద్దు చేస్తామన్నారు. పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామన్నారు.