Loading...
Andhra Pradesh rice prices: బియ్యం కొనేవారికి గుడ్‌న్యూస్.. ఏపీలో రకం వారీగా గరిష్ఠ ధరలు ఖరారు!
బియ్యం కొనేవారికి గుడ్‌న్యూస్.. ఏపీలో రకం వారీగా గరిష్ఠ ధరలు ఖరారు!

Andhra Pradesh rice prices: బియ్యం కొనేవారికి గుడ్‌న్యూస్.. ఏపీలో రకం వారీగా గరిష్ఠ ధరలు ఖరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సామాన్య ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించడమే లక్ష్యంగా ధరలపై గరిష్ఠ పరిమితులు విధించింది. అంతేకాకుండా ధాన్యం, బియ్యం నిల్వలపైనా పరిమితులు నిర్ణయించింది. బియ్యం రకాలను బట్టి కిలో ధరను రూ.47 నుంచి రూ.82 వరకు నిర్ధారించింది.

వివరాలు

బియ్యం రకాలను బట్టి ధరల నిర్ణయం

బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ), కేఎన్ఎం రకాల బియ్యం కిలో ధరను రూ.66గా ప్రభుత్వం నిర్ణయించింది.

హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాల బియ్యానికి కిలో రూ.76గా గరిష్ఠ ధరను ఖరారు చేసింది. జైశ్రీరామ్ రకం బియ్యం కిలో రూ.82గా, ఎంటీయూ సాధారణ రకాల బియ్యం కిలో రూ.47గా నిర్ణయించింది.

అలాగే ఎంటీయూ రకం బియ్యం 26 కిలోల బస్తా ధరను రూ.1,222గా నిర్ధారించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు బియ్యం విక్రయిస్తే వ్యాపారులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వివరాలు

రైతు బజార్లు, ప్రత్యేక కేంద్రాల్లో ధరణి బ్రాండ్ బియ్యం

ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ధరణి బ్రాండ్‌కు చెందిన 26 కిలోల బియ్యం బస్తాలను రైతు బజార్లు, ప్రత్యేక కేంద్రాల్లో తక్కువ ధరకు విక్రయిస్తోంది.

ఈ విక్రయాలను మొబైల్ వాహనాల ద్వారా కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో మరింత మందికి తక్కువ ధరకు బియ్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

డిసెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలకు సరుకులను పంపిణీ చేయనుంది.

ADVERTISEMENT

వివరాలు

దేశవ్యాప్తంగా పెరిగిన బియ్యం ధరలు

ఇందులో భాగంగా కిలో కందిపప్పును రూ.100కు, కిలో గోధుమ పిండిని రూ.25కు, లీటర్ పామాయిల్‌ను రూ.125కు అందించనుంది.

అలాగే రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. ఆధార్ కార్డు తీసుకెళ్లి సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు కొనుగోలు చేయవచ్చు.

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో బియ్యం ధర రూ.100కు చేరుకుంది. 26 కిలోల బియ్యం బస్తా కొనాలంటే సుమారు రూ.3 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే అదనుగా కొందరు వ్యాపారులు, మిల్లర్లు అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

ADVERTISEMENT

వివరాలు

తెలంగాణలోనూ గరిష్ఠ ధరల పరిమితి

బియ్యం ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. వివిధ రకాల బియ్యానికి గరిష్ఠ ధరలను నిర్ణయించింది.

ప్రభుత్వం నిర్దేశించిన ధరల పరిధిలోనే వ్యాపారులు బియ్యం విక్రయించాలని స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు అమ్మితే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఇటీవల హెచ్చరించింది.

ADVERTISEMENT