TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిల్లర కోసం ఇక బాధపడాల్సిన పనిలేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోవడంతో పెద్దనోట్లు ఇస్తుంటారు.
ఈ సందర్భంలో టికెట్ ఇచ్చే డ్రైవర్ లేదా కండక్టర్ మిగతా బ్యాలెన్స్‌ను టికెట్ వెనుక రాసి, దిగేటప్పుడు తీసుకోవాలని సూచిస్తారు.
అయితే కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు.
ఇప్పటి వరకు, మరిచిపోయిన చిల్లరను తిరిగి పొందేందుకు ప్రయాణికులు ఆర్టీసీ డిపోకు వెళ్లాల్సి వచ్చేది.
కానీ చిన్న మొత్తంలో చిల్లర కోసం డిపో వరకు వెళ్లడం సమయం, శ్రమ వృథా అవుతుందని చాలామంది దానిని వదిలేస్తున్నారు.
ఇకపై చిల్లర మర్చిపోయినా, చింతించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ ప్రకటించింది.
Details
బస్ మిస్సైన ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యం
కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో, ప్రయాణికులు 040-69440000 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు అందిస్తే, రావాల్సిన చిల్లరను ఫోన్‌పే ద్వారా పంపిస్తామని తెలిపింది.
అంతేకాదు ప్రయాణంలో ఏవైనా వస్తువులు మర్చిపోతే కూ6డా ఇదే నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టంచేసింది.
దూర ప్రయాణాల్లో, మార్గమధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు, కొందరు ప్రయాణికులు బస్సును మిస్ అవుతుంటారు.
అలాంటి సందర్భాల్లో, టికెట్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే, అదే టికెట్‌తో మరో బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఆర్టీసీ ప్రకటించింది.
ఈ కొత్త సేవల ద్వారా, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించడమే కాకుండా, చిల్లర సమస్యను పూర్తిగా నివారించేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.