Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు గుడ్ న్యూస్… 'గిరిదర్శక్'గా ప్రభుత్వ ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం కోసం పర్యాటక రంగాన్ని ఉపాధి వేదికగా మార్చే దిశగా ముందడుగు వేసింది. అటవీ ప్రాంతాలపై వారికి ఉన్న లోతైన అవగాహనను గుర్తించిన ప్రభుత్వం, వారిని టూరిస్ట్ గైడ్స్‌గా నియమించాలనే ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలు, కర్రిగుట్టలు వంటి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడంలో వారి సేవలను వినియోగించనుంది.
వివరాలు
ఒక నెల పాటు ప్రత్యేక శిక్షణిస్తాం
ఈ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు 'గిరిదర్శక్' అనే ప్రత్యేక గుర్తింపుతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అటవీ సంపద, స్థానిక పర్యాటక విశేషాలను పర్యాటకులకు వివరించడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ముందుగా వారికి ఒక నెలపాటు ప్రత్యేక శిక్షణను ప్రభుత్వం అందించింది. ప్రత్యేకంగా ములుగు అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల్లో వీరిని గైడ్స్‌గా నియమించి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నిర్ణయంతో అటవీ పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు, లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.