
Annadata Sukhibhava : అన్నదాతలకు శుభవార్త.. 'సుఖీభవ' నిధులు పడేది అప్పుడే!
ఈ వార్తాకథనం ఏంటి
అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకం తొలివిడత అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. సూపర్ సిక్స్ కార్యాచరణలో భాగంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (సీఎస్) కేఎస్ విజయానంద్, సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులందరికీ సకాలంలో నిధులు జమ చేసేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల వివరాలను మరోసారి ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
Details
ఇ క్రాప్ నమోదు తప్పనిసరి
అలాగే, ఇంకా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులు రైతుసేవా కేంద్రాలను మూడు రోజుల్లో సంప్రదించాలని సూచించారు. రైతులకు ఆర్థికంగా మద్దతు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని సీఎస్ తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు చొప్పున సాయం అందిస్తున్నట్టు వివరించారు. కౌలు రైతులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, వారికి సీసీఆర్సీ కార్డుతోపాటు తప్పనిసరిగా 'ఇ-క్రాప్' నమోదు ఉండాలని సూచనలు చేసింది. ఇక వచ్చే అక్టోబర్‌లో మరో విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. కానీ తక్షణమే ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయని స్పష్టం చేశారు.