
Minister Narayana : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. టిడ్కో గృహాల పంపిణీపై స్పష్టత ఇచ్చిన మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో గృహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది లబ్ధిదారులకు శుభవార్త అని చెప్పవచ్చు. వచ్చే సంవత్సరం మార్చి 31, 2026 నాటికి టిడ్కో గృహాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. శనివారం కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టులో టిడ్కో గృహాలను పరిశీలించిన మంత్రి, అక్కడ కాలనీలో ఉన్న సమస్యలను తెలుసుకొని అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నారాయణ, తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేశామని, అందులో 4.74 లక్షల ఇళ్లకు టెండర్లు ఆహ్వానించామని వివరించారు. మహిళలు తమ స్వంతింటిలో ఆనందంగా నివసించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం అని చెప్పారు.
Details
టిడ్కో ఇళ్లకు పార్టీ జెండాల రంగులు పూశారు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల సంఖ్యను 1.16 లక్షలకు కుదించిందని ఆరోపించారు. అలాగే జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు తమ పార్టీ జెండా రంగులు పూసిందని విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో జపాన్, సింగపూర్, రష్యా, మలేషియా, చైనా వంటి దేశాల్లో వినియోగించే షీర్ వాల్ టెక్నాలజీను ఉపయోగించామని, దీని వల్ల టిడ్కో ఇళ్లు భూకంపాలను తట్టుకునే స్థాయిలో బలంగా ఉంటాయని మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 163 టిడ్కో టౌన్‌షిప్‌ల పనులు తిరిగి ప్రారంభమవుతాయని, వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఈ కాలనీల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. అలాగే టిడ్కో కాలనీల్లో పుట్టుకొచ్చిన కంప చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Details
బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి
రోడ్లు, పార్కులు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, స్కూళ్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం డిసెంబరు నాటికి 3,056 ఇళ్లను, వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 3,826 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించి స్థానికుల అభ్యర్థన మేరకు పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇక మంత్రి టీజీ భరత్ అభ్యర్థన మేరకు సమీపంలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ఎంఎస్‌ఎంఈ కింద పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. నగరంలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాలను విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.