Special Trains: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. దసరా,దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు
బతుకుదెరువు కోసం చాలా మంది తమ సొంత ఊరును వదిలి నగరాలకు వచ్చి జీవనం కొనసాగించడం ఈ రోజుల్లో సాధారణంగా మారింది. ముఖ్యంగా అవసరమైన పనుల కోసం లేదా పండుగ సందర్భాల్లో సొంత ఊర్లకు వెళ్లే సమయంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండుగ సమయాల్లో తమ ఊర్లకు చేరేందుకు అధిక రుసుములు చెల్లించి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సమయంలో బస్సులు, రైళ్లు ప్రయాణికులతో నిండిపోతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, రాబోయే దసరా, దీపావళి పండుగ రోజులలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు చూస్తే..
అక్టోబర్ 5 నుండి నవంబర్ 12 వరకు ఒక్కో మార్గంలో ఆరు ట్రిప్పులు
దక్షిణ మధ్య రైల్వే మొత్తం 24ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా,దీపావళి పండుగల సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా,ఈ రైలు సర్వీసులు అక్టోబర్ 5 నుండి నవంబర్ 12 వరకు ఒక్కో మార్గంలో ఆరు ట్రిప్పుల చొప్పున నడుస్తాయి. సికింద్రాబాద్-తిరుపతి రైలు అక్టోబర్ 5 నుండి నవంబర్ 9 వరకు ప్రతి శనివారం నడవనుంది, తిరుపతి-సికింద్రాబాద్ రైలు అక్టోబర్ 8 నుండి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం నాడు ప్రయాణిస్తుంది. అలాగే, తిరుపతి-శ్రీకాకుళం రోడ్ రైలు అక్టోబర్ 6 నుండి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది, శ్రీకాకుళం రోడ్-తిరుపతి రైలు అక్టోబర్ 7 నుండి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది.