Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ఫీజులు వసూలుచేసి ప్రజలను అప్పులపాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజల బాధలు తీర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీచేసింది.
పెండింగ్ దరఖాస్తులపై తాఖీదులు
పట్టణాభివృద్ధి సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై మరల తాఖీదులు జారీ చేయనున్నారు. దరఖాస్తుదారుల నుంచి అదనపు సమాచారం, అవసరమైన పత్రాలు, చెల్లించాల్సిన ఫీజుల వివరాలపై నోటీసులు సిద్ధం చేస్తున్నారు. గతంలో కూడా నోటీసులు పంపినా ప్రజల నుంచి సరైన స్పందన రాలేదని అధికారులు పేర్కొన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల సహాయంతో మొదట ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, నోటీసులు అందుకున్నప్పటికీ చాలామంది స్పందించలేదు. అదనపు సమాచారం పంపడంలో సర్వేయర్ల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో, దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. తాజా ఆదేశాల ప్రకారం, దరఖాస్తుదారుల చిరునామాలకు పోస్టుల ద్వారా నోటీసులు పంపించనున్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందించి, అదనపు పత్రాలు సమర్పించిన వారి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.
ప్రత్యేక ఖాతాల్లో నిధుల కొరత
గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన రూ.470 కోట్ల ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించింది. ఈ నిధులను ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ నియమాన్ని పాటించలేదు. దీంతో క్రమబద్ధీకరణ ఫీజుల ద్వారా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశం నెరవేరలేదు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లో వచ్చిన ఆదాయం పూర్తి స్థాయిలో వాడిపోయారు.
సమీక్షలు లేకపోవడం, ఆదేశాల లోపం
గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సరైన సమీక్షలు చేయలేదు. ఫీజుల వసూళ్ల కోసం నోటీసులు పంపించడమే తప్ప, మంత్రిత్వస్థాయిలో సమీక్షలు జరపలేదు. పరిష్కరించామనే 30 వేల దరఖాస్తులలోనూ అనేక దోషాలు ఉన్నాయి. రికార్డుల్లో పరిష్కారంగా చూపించిన చాలా దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, వినతుల స్వీకరణకు ప్రత్యేక మేళాలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.