Hydrogen Cooktop: గ్యాస్‌కు గుడ్‌బై.. నీటితో వంట చేసే హైడ్రోజన్ స్టవ్ మార్కెట్లోకి! ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో చమురు, గ్యాస్ సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక భారతీయ క్లీన్-టెక్ స్టార్టప్ గ్రీన్‌వైజ్ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. నీటినే ఇంధనంగా మార్చి వంట చేయగలిగే సరికొత్త స్టవ్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెరుగుతున్న ఎల్పీజీ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ఈ స్టవ్ ఎలక్ట్రోలిసిస్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ ప్రక్రియలో నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టి, విడుదలైన హైడ్రోజన్‌ను మంటగా మార్చి వంటకు ఉపయోగిస్తారు. ఈ విధానం వల్ల ఎటువంటి హానికరమైన పొగ లేదా కార్బన్ ఉద్గారాలు ఉండవు.
వివరాలు
ఆరు గంటల పాటు నిరంతరాయంగా వంట చేయొచ్చు
అంతేకాకుండా, ఆక్సిజన్ విడుదల కావడం వల్ల వంటగదిలో గాలి శుద్ధి అవుతుంది. గ్రీన్‌వైజ్ రూపొందించిన ఈ హైడ్రోజన్ కుక్‌టాప్‌లో గ్యాస్ సిలిండర్లు లేదా పైప్‌లైన్ల అవసరం ఉండదు. కేవలం 100 మిల్లీ లీటర్ల డిస్టిల్డ్ నీరు, 1 యూనిట్ (1 kWh) విద్యుత్తుతో సుమారు 6 గంటలపాటు నిరంతరంగా వంట చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇది సాధారణ ఇండక్షన్ స్టవ్‌లతో పోలిస్తే దాదాపు 90 శాతం తక్కువ విద్యుత్తు వినియోగిస్తుంది. ఇంకా, ఈ స్టవ్‌ను రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లతో అనుసంధానించవచ్చు. దీంతో విద్యుత్ బిల్లు లేకుండానే వంట చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇండక్షన్ స్టవ్‌లకు భిన్నంగా, ఇనుము, అల్యూమినియం, మట్టి పాత్రలు సహా అన్ని రకాల పాత్రలను దీనిపై ఉపయోగించవచ్చు.
వివరాలు
ఉత్పత్తి పెరిగే కొద్ది ధరలు తగ్గే అవకాశం
ధర విషయానికి వస్తే, ఈ టెక్నాలజీ కొత్తదైనందున ప్రస్తుతం ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సింగిల్ బర్నర్ స్టవ్ ధర సుమారు రూ.1,05,000 + GST కాగా, డబుల్ బర్నర్ స్టవ్ ధర రూ.1,50,000 + GST వరకు ఉంది. ధర అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఇది సామాన్య ఇళ్ల కంటే హోటళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, క్యాంటీన్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉత్పత్తి పెరిగే కొద్దీ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా వచ్చిన ఈ ఆవిష్కరణ, భవిష్యత్తులో వంట గ్యాస్‌పై ఆధారాన్ని తగ్గించే దిశగా కీలక ముందడుగు అని చెప్పొచ్చు.