LOADING...
South Central Railway: ఆరు డివిజన్లకు గుడ్‌బై.. 3 డివిజన్లతోనే ద.మ. రైల్వే కార్యకలాపాలు
ఆరు డివిజన్లకు గుడ్‌బై.. 3 డివిజన్లతోనే ద.మ. రైల్వే కార్యకలాపాలు

South Central Railway: ఆరు డివిజన్లకు గుడ్‌బై.. 3 డివిజన్లతోనే ద.మ. రైల్వే కార్యకలాపాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో జూన్‌ 1 నుంచి భారీ పరిపాలనా మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్న ఆరు డివిజన్ల వ్యవస్థ మే 31తో ముగియనుంది. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో డివిజన్ల సంఖ్యను మూడు — సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌కు పరిమితం చేయనున్నారు. ఈ మార్పులతో పరిపాలనా భారం కొంత తగ్గే అవకాశమున్నప్పటికీ, సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధి మాత్రం గణనీయంగా విస్తరించనుంది. ప్రస్తుతం 6,637 ట్రాక్‌ కిలోమీటర్ల పరిధిలో ఉన్న జోన్‌ కార్యకలాపాలు, పునర్విభజన తర్వాత 3,589 ట్రాక్‌ కిలోమీటర్లకే పరిమితం కానున్నాయి.

వివరాలు

రెండు జోన్ల ఉన్నతాధికారులతో సమావేశం

ఇదే సమయంలో సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ అమల్లోకి రానుండటంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు కొత్త జోన్‌ పరిధిలోకి మారనున్నాయి. పునర్విభజనలో భాగంగా గుంటూరు డివిజన్‌లోని పగిడిపల్లి-విష్ణుపురం-జాన్‌పహాడ్‌ సెక్షన్‌, అలాగే గుంతకల్‌ డివిజన్‌ పరిధిలోని రాయచూరు-వాడి రైల్వే మార్గాన్ని సికింద్రాబాద్‌ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. దీంతో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధి మరో 204 కిలోమీటర్లు పెరగనుంది. కొత్త దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు, దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు రైల్వే బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇటీవల రెండు జోన్ల ఉన్నతాధికారులతో రైల్వే బోర్డు ఛైర్మన్‌ ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించింది.

వివరాలు

జూన్‌ 1 నుంచి విడివిడిగా కార్యకలాపాలు

జూన్‌ 1 నుంచి విడివిడిగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించినట్లు సమాచారం. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధి పెరగడంతో రైళ్ల రాకపోకలు, సిగ్నలింగ్‌ సమన్వయం వంటి అంశాల్లో ఒత్తిడి అధికమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా రైళ్ల నిర్వహణలో డివిజన్‌ కంట్రోల్‌రూం కీలక బాధ్యత నిర్వహిస్తుంది. ఏ రైలుకు ముందుగా క్లియరెన్స్‌ ఇవ్వాలి, ఏ రైలును ఎక్కడ నిలిపివేయాలి వంటి అంశాలపై స్టేషన్‌ మాస్టర్లకు కంట్రోల్‌రూం కంట్రోలర్లు సూచనలు జారీ చేస్తుంటారు. ఇక కొత్త దక్షిణ కోస్తా జోన్‌ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Advertisement

వివరాలు

దక్షిణ కోస్తా జోన్‌లో 30 మంది గెజిటెడ్‌ అధికారులు

ఇప్పటికే జనరల్‌ మేనేజర్‌, ప్రిన్సిపల్‌ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు అధికారులను నియమించి విధుల్లో చేర్చింది. అదేవిధంగా కొత్త జోన్‌కు 128 గెజిటెడ్‌, 1,100 నాన్‌గెజిటెడ్‌ పోస్టులను మంజూరు చేసింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి కొత్త జోన్‌కు భారీగా పోస్టుల బదిలీ జరిగింది. ఇందులో 35 గెజిటెడ్‌, 980 నాన్‌గెజిటెడ్‌ పోస్టులను రైల్వే బోర్డు బదిలీ చేసింది. మిగిలిన పోస్టులను ఇతర జోన్ల నుంచి బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా జోన్‌లో 30 మంది గెజిటెడ్‌ అధికారులు, 300కుపైగా నాన్‌గెజిటెడ్‌ సిబ్బంది విధుల్లో చేరినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

Advertisement