Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం
దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్‌ఫోన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజల జీవన శైలిని మెరుగుపరచడమే 'ఈజ్ ఆఫ్ లివింగ్' విధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగానికి, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి సచివాలయంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు బిక్రమ్‌సింగ్ బేడి, ఏపీ రియల్‌టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్ సంతకాలు చేశారు.
స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడం
ఈ ఒప్పందం ద్వారా సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు మౌలిక వనరులు లభిస్తాయి. మంత్రి పేర్కొన్నట్లుగా, యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్తు అవకాశాలు కల్పించడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని, ఆధునాతన సాంకేతికతను ప్రజల జీవితాల్లోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, వాటి ప్రయోజనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే గూగుల్ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పాలనలో కృత్రిమ మేధ వినియోగం ద్వారా వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ ఒప్పందం బలాన్నిస్తుందని గూగుల్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
విద్యా, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల శిక్షణ కోసం 10 వేల మందికి గూగుల్ శిక్షణ అందిస్తుంది. రోజువారి జీవితంలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్ వంటి విభాగాల్లో గూగుల్ సహకారం అందిస్తుంది. స్టార్టప్ ఎకోసిస్టమ్: స్టార్టప్‌ల అభివృద్ధికి గూగుల్ మెంటార్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలు కల్పిస్తుంది. అర్హత కలిగిన స్టార్టప్‌లకు క్లౌడ్ క్రెడిట్స్, సాంకేతిక శిక్షణ అందిస్తుంది. సుస్థిరత: గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్ సహకరిస్తుంది. వైద్య సేవల అభివృద్ధి: ఆరోగ్య సంరక్షణ సేవల మెరుగుదలకు, రోగ నిర్ధారణ వేగవంతం చేయడానికి గూగుల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
గూగుల్‌తో ఒప్పందం ఓ గొప్ప ముందడుగు: చంద్రబాబు
ఏఐ పైలట్ ప్రాజెక్టులు:వ్యవసాయం,ట్రాఫిక్ నిర్వహణ,వెబ్‌సైట్ ఆధునికీకరణ,పౌర ఫిర్యాదుల పరిష్కారం వంటి రంగాల్లో పైలట్ ప్రాజెక్టులకు గూగుల్ క్లౌడ్ సాంకేతికత అందిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా కృత్రిమ మేధ రంగంలో ఆవిష్కరణలకు దారులు తెరవడంతో పాటు, ప్రభుత్వం తలపెట్టిన రియల్‌టైమ్ పాలనకు మద్దతు లభిస్తుంది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం,గూగుల్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా,ఉండవల్లిలోని తన నివాసంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు,కంట్రీ ఎండీ బిక్రమ్‌సింగ్ బేడి సహా సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు,లోకేశ్ సమక్షంలో ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా,గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.