Gopan Swamy 'Samadhi': కేరళ సమాధి కేసులో ఆసక్తికర మలుపు.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నెయ్యట్టింకర సమాధి కేసు ఆసక్తికర మలుపు తీసుకుంది.
కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఉదయం పోలీసులు భారీ బందోబస్తు నడుమ సమాధిని తవ్వారు.
అక్కడ నుంచి గోపన్ స్వామి మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్షల కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద అంశాలు బయటపడకపోయినా, సమాధిలో బూడిదతో పాటు పూజల ఆనవాళ్లు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
వివరాలు
సమాధిని తవ్వేందుకు ప్రయత్నం, అడ్డుకున్నకుటుంబ సభ్యులు
నెయ్యట్టింకర ప్రాంతంలో నివసించే గోపన్ స్వామి, స్థానికులకు మణియన్‌గా పరిచయం.
వయసు మీదపడడంతో కూలి పనులు మానేసి ఇంటిపట్టునే ఉంటూ, తన భక్తి భావంతో చిన్న ఆలయంలో పూజలు నిర్వహించేవారు.
జనవరి 9న ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన ధ్యానముద్రలో సజీవ సమాధి అయ్యారని ప్రకటించారు.
అయితే ఈ సంఘటన స్థానికులు, బంధువులలో అనుమానాలు రేకెత్తించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టగా, ఈ కేసు కలెక్టర్ కార్యాలయం దాకా చేరింది.
జనవరి 13న సబ్ కలెక్టర్ సమక్షంలో సమాధిని తవ్వేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు దీన్ని అడ్డుకున్నారు.
వివరాలు
ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తేలనున్న నిజం
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు,అనుమాన నివృత్తి కోసం సమాధిని తవ్వడం తప్పనిసరిగా అవసరం అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ ఉదయం, హైకోర్టు ఆదేశాల మేరకు,ఆర్డీవో ఆధ్వర్యంలో పోలీసులు సమాధిని తవ్వి గోపన్ స్వామి మృతదేహాన్ని వెలికితీశారు.
అక్కడ ఉన్న ఆధారాలు కేసు మరింత రహస్యంగా మారుస్తున్నాయి. గోపన్ సహజంగా మరణించాడా లేక ఇది పన్నాగమా అనేది ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తేలనుంది.
శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు.
స్థానికులు మాత్రం కుటుంబ సభ్యుల మాటలను నమ్మడం లేదని,లోతైన దర్యాప్తు జరిగితేనే నిజాలు వెలుగు చూస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికల కోసం పోలీసులు,స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.