Page Loader
గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం 
గోరఖ్‌పూర్‌ గీతా ప్రెస్‌కు రూ.కోటి నగదు పురస్కారం

గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 19, 2023
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కార విజేతను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఈ అవార్డు కోసం గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో విశేషంగా సేవలందించిన సంస్థ కృషికి గుర్తింపుగానే ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. కుల, మత, లింగ, జాతి బేధాలు లేకుండా మాహాత్ముడి బాటలో పయణిస్తున్నారని కొనియాడింది. గీతాప్రెస్ తమ వంతుగా దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్న తీరును గుర్తించామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గీతాప్రెస్‌కు శాంతి పురస్కారం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వివరించింది.

DETAILS 

 గీతాప్రెస్‌కు రూ.కోటి ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం

గీతాప్రెస్‌కు అవార్డు కింద కోటి రూపాయల భారీ ప్రైజ్ మనీతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను సైతం కేంద్రం తరఫున అందజేయనున్నారు. గోరఖ్‌పూర్‌కి చెందిన గీతాప్రెస్‌ 2021కి గానూ గాంధీ శాంతి బహుమతి అందుకోనుండటం పట్ల ప్రధాని అభినందనలు తెలియజేశారు. గత 100 ఏళ్లుగా ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక పరివర్తనలను పెంపొందించడానికి ఎంతో కృషి చేశారని నరేంద్ర మోదీ కీర్తించారు. 1995లో తొలిసారిగా గాంధీ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్రం ఈ అవార్డును ప్రవేశపెట్టింది. అయితే గతంలో ఈ సత్కారం పొందిన జాబితాలో ఇస్రో, రామకృష్ణ మిషన్, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్, కన్యాకుమారిలోని వివేకానంద సెంటర్, బెంగళూరుకు చెందిన అక్షయ పాత్ర, ఏక్తా అభియాన్ ట్రస్ట్, న్యూదిల్లీకి చెందిన సులభ్ ఇంటర్నేషనల్ నిలిచాయి.

DETAILS

పలువురు దేశాధినేతలకూ గాంధీ శాంతి పురస్కారం

ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ శాంతి పురస్కారాన్ని ఇప్పటికే పలువురు దేశాధినేతలు, అంతర్జాతీయ నాయకులు అందుకున్నారు. దక్షిణాఫ్రికాకి చెందిన మాజీ ప్రెసిడెంట్, ప్రముఖ రాజకీయ నేత నెల్సన్ మండేలా, ( గాంధీ ఫాలోవర్), టాంజానియా మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ జిలియస్ నైరేరే, సర్వోదయ శ్రమదాన్ ఉద్యమం వ్యవస్థాపకుడు డాక్టర్ ఏటీ అరియరత్నెలు ఈ పురస్కారాన్ని అందుకున్న జాబితాలో నిలిచారు. అయితే గత నాలుగేళ్లలో గాంధీ శాంతి పురస్కారం అందుకున్న వారిలో 2019లో ఒమన్ సుల్తాన్ దివంగత ఖబూస్ బిన్ సైద్, 2020లో దివంగత బంగ్లా బంధు షేక్ ముజబుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)‌కు కేంద్రం ఈ అవార్డులను అందించడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 గీతాప్రెస్ కృషిని అభినందిస్తూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

DETAILS

గీతాప్రెస్‌కు గాంధీ బ‌హుమ‌తినివ్వ‌డం అంటే సావ‌ర్క‌ర్‌, గాడ్సేల‌ను స‌న్మానించినట్టే : కాంగ్రెస్ 

మరోవైపు గాంధీ శాంతి బ‌హుమ‌తిని గీతాప్రెస్‌కు ప్రకటించడంపై కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు గీతా ప్రెస్‌ను ఎంపిక చేయ‌డం అంటే పురస్కారాన్ని అప‌హాస్య‌ం చేయడమేనని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ అన్నారు. గీతా ప్రెస్‌కు గాంధీ బ‌హుమ‌తినివ్వ‌డం అంటే సావ‌ర్క‌ర్‌, గాడ్సేల‌ను స‌న్మానించినట్టు ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్రం నిర్ణయంపై పెదవివిరిచారు. ఆ సంస్థకు చెందిన అక్ష‌య ముకుల్ అనే ర‌చ‌యిత హిందూ భార‌త నిర్మాణం పేరుతో బ‌యోగ్ర‌ఫీ రాశార‌న్న జైరాం రమేశ్, ఈ పుస్త‌కం మ‌హాత్ముడితో ముకుల్‌కు ఉన్న విభేదాల గురించి ప్ర‌స్తావిస్తుంద‌న్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్న కాంగ్రెస్ నేత జైరాం రమేష్