Model Primary Schools: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి రూ.571 కోట్ల మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
'మన బడి మన భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,989 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మొత్తం పది రకాల అభివృద్ధి పనుల కోసం రూ.571.11కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. పాఠశాలల్లో ప్రధాన, చిన్నపాటి మరమ్మతుల కోసం 1,914 బడులకు రూ.55.56 కోట్లు కేటాయించారు. వరండాలను తరగతి గదులుగా మార్చేందుకు 3,171 పాఠశాలలకు రూ.44.69 కోట్లు మంజూరు చేశారు. విద్యుత్ సదుపాయాల మెరుగుదలకు ఫ్యాన్లు, దీపాల ఏర్పాటుకోసం 2,569 పాఠశాలలకు రూ.21.06 కోట్లు విడుదల చేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి 2,050 పాఠశాలలకు రూ.64.72 కోట్లు కేటాయించగా,పెద్ద తరగతి గదులను రెండుగా విభజించేందుకు 1,585 పాఠశాలలకు రూ.22.07 కోట్లు మంజూరు చేశారు.
వివరాలు
అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.143.72 కోట్లు
పాఠశాల భవనాలకు రంగులు వేయడానికి 3,327 బడులకు రూ.72.56 కోట్లు విడుదల చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు 3,161 పాఠశాలలకు రూ.64.22 కోట్లు కేటాయించారు. పచ్చబోర్డుల ఏర్పాటుకు 3,371 పాఠశాలలకు రూ.19.56 కోట్లు మంజూరు చేశారు. ద్వంద్వ బెంచీల కొనుగోలుకు 2,808 పాఠశాలలకు రూ.62.95 కోట్లు విడుదల చేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి 981 పాఠశాలలకు రూ.143.72 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అభివృద్ధి పనులను పాఠశాల తల్లిదండ్రుల కమిటీల ద్వారా కాకుండా టెండర్ల విధానంలో చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది.