AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం
మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టినప్పటికీ, ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే వాయిదా మొత్తాలు చెల్లించిన వారికి నష్టపోకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ పేరు మార్పు
గత ప్రభుత్వం హాయంలో పట్టణాల్లో 175 లేఅవుట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 36 లేఅవుట్లకే పరిమితమైంది. రోడ్లు, తాగునీరు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇక జగన్ స్మార్ట్ టౌన్‌షిప్ పేరు మార్చి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌గా ప్రకటించారు
త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ
వాయిదా మొత్తం చెల్లించిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి, త్వరలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వారికి ప్లాట్లను అప్పగించనున్నారు. ఇంకా వాయిదాలు చెల్లించాల్సిన దరఖాస్తుదారుల నుంచి పెండింగ్ మొత్తాలను వసూలు చేసి, లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేపట్టనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి ప్రధాన పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్లకు మంచి స్పందన లభించింది. అయితే పనుల నిర్వహణలో జాప్యం కారణంగా దరఖాస్తుదారుల్లో కొందరు వెనక్కి వెళ్లారు.