Page Loader
Telangana: చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Telangana: చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు మొత్తం రూ.33 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకూ చేనేత కార్మికులు వ్యక్తిగతంగా బ్యాంకులు,జిల్లా సహకార కేంద్రబ్యాంకుల ద్వారా చేనేత వస్త్ర ఉత్పత్తి, నిర్వహణ మూలధనం,ఇతర వృత్తి ఆధారిత అవసరాల కోసం తీసుకున్న రూ.లక్ష వరకు రుణాలపై (అసలు,వడ్డీ సహా) ఈ మాఫీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం, లబ్ధిదారుల ఎంపికను ఆయా జిల్లాల సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

వివరాలు 

రైతుల ఖాతాల్లో మాఫీ అయిన మొత్తం జమ

ఈపథకం అమలుకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీని,చేనేత సంచాలకుడి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయి కమిటీల నుంచి అందే ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి ఆమోదించిన తరువాతే రుణమాఫీ అమలు అవుతుంది. ఆతర్వాత సంబంధిత రైతుల ఖాతాల్లో మాఫీ అయిన మొత్తం జమ అవుతుంది. అనంతరం బ్యాంకులు మాఫీ పూర్తయిందని 'నో డ్యూస్‌' ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. కార్మికులు ఆపై మళ్లీ రుణం కావాలనుకుంటే, బ్యాంకులు వారి అర్హత ఆధారంగా రుణాలను మంజూరు చేయగలవు. అయితే ప్రస్తుతం చేనేత రంగంలో లేని కార్మికులు లేదా వారి ఖాతాలు నిరర్థక ఆస్తుల ఖాతాగా (ఎన్‌పీఏ)గుర్తించబడినవారికి పునఃరుణం పొందే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.