LOADING...
Telangana: మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రభుత్వ భూములు.. ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్‌సిటీలో కేటాయింపు 
ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్‌సిటీలో కేటాయింపు

Telangana: మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రభుత్వ భూములు.. ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్‌సిటీలో కేటాయింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి కోసం గండిపేట,రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాల్లో ఉన్న భూములను ప్రభుత్వం కేటాయించింది. ముందుగా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కొన్ని భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఈ కేటాయింపులు చేశారని సమాచారం. ప్రస్తుతం ఆ స్థలాల్లో ఉన్న నిర్మాణాలను కూడా తొలగించే అవకాశం ఉంది. అయితే ఆ సంస్థలకు ప్రత్యామ్నాయంగా శంషాబాద్‌ మండలంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌, భారత్‌ ఫ్యూచర్‌సిటీలో కొత్త భవనాలను నిర్మించి అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

భారత్‌ ఫ్యూచర్‌సిటీలో ఐఐపీహెచ్‌ ఏర్పాటు

హిమాయత్‌సాగర్‌కు సమీపంగా ఉన్న వాలంతరి, సహకార ఎపెక్స్‌ బ్యాంక్‌, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌, రెడ్డి వసతిగృహం, ఇతర సంస్థలకు శంషాబాద్‌లోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో కొత్త భవనాలు నిర్మించనున్నారు. అలాగే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీహెచ్‌)ను భారత్‌ ఫ్యూచర్‌సిటీలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ సంస్థలు ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌, ప్రేమావతిపేట్‌, కిస్మత్‌పూర్‌, బుద్వేల్‌ మరియు కొత్వాల్‌గూడ ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాల్లోని వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, శిక్షణా,పరిశోధనా కేంద్రాలు, రెడ్డి వసతిగృహం, ఎస్సీ-ఎస్టీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ కోసం మొత్తం 734.07 ఎకరాలు కేటాయించారు.

వివరాలు 

ప్రస్తుతం వినియోగంలో  233.38 ఎకరాలు మాత్రమే 

అందులో ప్రస్తుతం 233.38 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉండగా, మిగిలిన 500.09 ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఖాళీ భూములతో పాటు నిర్మాణాలను కూడా స్వాధీనం చేసుకొని మూసీనది అభివృద్ధి కార్పొరేషన్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కొత్వాల్‌గూడ సర్వే నంబర్‌ 54లో హెచ్‌ఎండీఏ ఎకోపార్క్‌ కోసం కేటాయించిన 71.23 ఎకరాల్లో పార్క్‌ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండటంతో, ఈ భూభాగాన్ని స్వాధీనానికి నుండి మినహాయించారు.