LOADING...
Telangana: తెలంగాణలో మరోసారి హౌసింగ్‌ స్థలాల  వేలానికి సర్కారు సిద్ధం
తెలంగాణలో మరోసారి హౌసింగ్‌ స్థలాల వేలానికి సర్కారు సిద్ధం

Telangana: తెలంగాణలో మరోసారి హౌసింగ్‌ స్థలాల  వేలానికి సర్కారు సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్‌ బోర్డు నిర్వహిస్తున్న ఖాళీ స్థలాలను వేలం ద్వారా అమ్మేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మరోసారి సిద్ధమైంది. ఈసారి రెండో విడతలో కూడా స్థలాలు, ఫ్లాట్ల వేలం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్‌ బోర్డు స్థలాల వేలం ద్వారా రాష్ట్రానికి రూ.3,500 కోట్లకు పైగా ఆదాయం రావాలని నిర్ణయించగా, ఇప్పటికే మొదటి విడతలోనే రూ.1,200 కోట్లకు పైగా వసూలు అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీ స్థలాలను వేలం వేయడానికి ప్రభుత్వం మరోసారి అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

వివరాలు 

రూ.100 కోట్ల ఆదాయమే లక్ష్యం 

ఈ విడతలో,మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం,గాజులరామారం ప్రాంతాలలోని టవర్‌ల ద్వారా రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మునుపటి మంత్రిమండలి ఉపసంఘం ఆమోదించిన ప్రకారం,మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పోతులమడుగు,అమిస్తాపూర్‌లోని ఖాళీ స్థలాలు,అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని తొర్రూర్, కుర్మల్‌గూడ్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్ ప్రాంతాలలోని ఖాళీ ఫ్లాట్లను కూడా వేలం కోసం సిద్ధం చేస్తున్నారు. హౌసింగ్‌ బోర్డు పరిధిలోని చింతల్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఐడీపీఎల్‌ కౌన్సిల్, నిజాంపేట్ ప్రాంతాల ఖాళీ స్థలాలు,ఫ్లాట్ల ద్వారా మరో రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చాలని ప్రభుత్వానికి ఆశ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదాయాన్ని పేదలు మరియు మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణ పథకాల కోసం మాత్రమే వినియోగించాలని యోచిస్తోంది.