LOADING...
Hyderabad: హైదరాబాద్‌ బస్తీల్లో సంచార అంగన్‌వాడీలు… 37 మొబైల్‌ కేంద్రాలకు ప్రభుత్వ ఆమోదం
37 మొబైల్‌ కేంద్రాలకు ప్రభుత్వ ఆమోదం

Hyderabad: హైదరాబాద్‌ బస్తీల్లో సంచార అంగన్‌వాడీలు… 37 మొబైల్‌ కేంద్రాలకు ప్రభుత్వ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసిస్తున్న బస్తీలు, మురికివాడల్లో అంగన్‌వాడీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ శాశ్వత భవనాలు అందుబాటులో లేకపోవడం, ఇతర మౌలిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని సంచార అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి ఏడాది సుమారు రూ.4 కోట్ల వ్యయంతో 37 మొబైల్‌ అంగన్‌వాడీ వాహనాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించింది. వీటివల్ల మొత్తం 274 మురికివాడల్లో నివసిస్తున్న చిన్నారులకు అంగన్‌వాడీ సేవలు చేరవేయాలని ప్రణాళిక రూపొందించారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 7, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డి జిల్లాలో 14 సంచార అంగన్‌వాడీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వివరాలు 

సంచార అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు

ఒక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు రూ.60 వేల అద్దెను చెల్లించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్‌,సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 2,364 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అయితే క్షేత్రస్థాయి సర్వేలో మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని 274 బస్తీల్లో 25,310మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇప్పటివరకు అంగన్‌వాడీ సేవలు అందడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, అధిక జనసాంద్రత, భవనాల లభ్యత లేకపోవడం,మౌలిక సదుపాయాల కొరత వంటి కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే సంచార అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మొబైల్‌ కేంద్రాల ద్వారా చిన్నారులకు టేక్‌హోం రేషన్‌ విధానంలో బాలామృతం,పాలు, స్నాక్స్‌, కోడిగుడ్లు, బియ్యం వంటి పోషకాహారాన్ని అందించనున్నారు.

Advertisement