Telangana: పాఠశాలల్లో స్కూల్ పిల్లలకు రోజూ పాలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పాలు సరఫరా కోసం రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ)కి తొలి విడతగా రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చారు. జూన్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పాలు అందుబాటులో ఉండేలా సరఫరా చేయాలని ఆదేశించారు. ఇటీవల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు పాలు అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
టెట్రా ప్యాక్‌లలో పంపిణీ
ఈ బాధ్యతను విజయ డెయిరీకి అప్పగించాలని సూచించారు. దీంతో విద్యాశాఖ అధికారులు డెయిరీ నుంచి ప్రతిపాదనలు తీసుకుని, తాజాగా సరఫరా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజయ డెయిరీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు 200 మిల్లీ లీటర్ల టెట్రా ప్యాక్‌లలో పాలు అందిస్తోంది. అలాగే ములుగు జిల్లాలో 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులకు 100 మిల్లీ లీటర్ల ప్యాకెట్లలో పాలు పంపిణీ ప్రారంభించింది. ఈ విధానం విజయవంతం కావడంతో, ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు, తర్వాత రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
టెట్రా ప్యాక్‌లలో పంపిణీ
ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా టెట్రా ప్యాక్‌లలోనే పాలు అందించేందుకు విజయ డెయిరీ సిద్ధమవుతోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) మార్గదర్శకాల ప్రకారం, ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు అల్పాహారం సమయంలో రోజుకు 150 నుంచి 200 మిల్లీ లీటర్ల పాలు అవసరం. అందుకు అనుగుణంగా 150 లేదా 200 మిల్లీ లీటర్ల ప్యాకెట్లలో సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.