
New Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం.. త్వరలో అప్‌డేటెడ్ వెర్షన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆరు దశాబ్దాల పాటు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా,ఆదాయపు పన్ను(Income Tax) కొత్త బిల్లు 2025ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లును తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు సమాచారం. దీనిని మరింత అప్‌డేట్ చేసి మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు, ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి.
వివరాలు
4500 పేజీలతో నివేదిక
ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై విపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, దీనిని సెలెక్ట్ కమిటీకి అప్పగించారు. ఆ కమిటీ ఈ బిల్లును పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసి, జులై 21న తమ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. మొత్తం 4500 పేజీలతో కూడిన ఈ నివేదికలో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేయబడ్డాయి. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, వాటి ఆధారంగా కొత్త బిల్లును రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఈ అప్‌డేటెడ్ బిల్లును ఆగస్టు 11న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
వివరాలు
టీడీఎస్,టీసీఎస్ రీఫండ్లను సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్న కమిటీ
సెలెక్ట్ కమిటీ ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లుకు కొన్ని ప్రధాన సూచనలను చేసింది. ముఖ్యంగా ఇంటిపై ఆదాయం పొందుతున్న వారికి ఉపశమనం కలిగించే విధంగా కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతంలో గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కేవలం స్వంత గృహంలోని రుణదారులకు మాత్రమే వర్తిస్తున్నాయి. అయితే, సొంత ఇంటిని అద్దెకు ఇచ్చిన సందర్భాల్లో కూడా వడ్డీపై పన్ను మినహాయింపు కల్పించాలని కమిటీ సూచించింది. అదనంగా, టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) రీఫండ్లను సులభతరం చేయాల్సిన అవసరం ఉన్నదని కమిటీ ప్రతిపాదించింది.
వివరాలు
1961లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టం 66 సార్లు సవరణలు
1961లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టం దాదాపు 66 సార్లు (రెండు మధ్యంతర బడ్జెట్లతో సహా) సవరణలు చవిచూసింది. దీంతో ఇది సంక్లిష్ట రూపం తీసుకున్నది, పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో, 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించి, దాన్ని సరళతరం చేయాలని ప్రకటించింది. అందుకు అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించడం జరిగింది.