Anti-paper leak bill: లీక్‌లకు చెక్.. లోక్‌సభ ముందుకు.. యాంటీ-పేపర్ లీక్ బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించేలా 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టంలో మార్పులు చేయాలనే నిర్ణయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
వివరాలు
విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే సభ ముందుకు బిల్లు
అయితే, విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు.
సభలో గందరగోళం నెలకొనడంతో అనంతరం లోక్‌సభ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
ఇటీవలి కాలంలో నీట్ (NEET) సహా పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది.
విద్యార్థులు,తల్లిదండ్రులు,వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.
వివరాలు
లీక్‌లను పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా చట్టాన్ని మరింత బలోపేతం
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.
ఈ వివాదాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రవేశపెట్టిన సవరణ బిల్లు పరీక్షల అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన బలాన్ని పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.