WhatsApp Username Feature: యూజర్‌నేమ్ ఫీచర్‌పై వాట్సప్‌కు కేంద్రం నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, అప్పటి వరకు భారతీయ వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు పూర్తయ్యాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. యూజర్‌నేమ్ ఫీచర్‌పై సైబర్ భద్రత నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రముఖులు, సంస్థలు లేదా ఇతరుల పేర్లను ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త చర్యగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
యూజర్‌నేమ్ ఫీచర్ అంటే ఏమిటి?
వినియోగదారుల ఫోన్ నంబర్‌ను గోప్యంగా ఉంచేందుకు వాట్సప్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఫోన్ నంబర్‌ను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం యూజర్‌నేమ్ ఆధారంగానే ఇతరులతో సంభాషణలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం యూజర్‌నేమ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పిస్తోంది. యూజర్‌నేమ్‌లో కనీసం 3 నుంచి గరిష్ఠంగా 35 అక్షరాలను ఉపయోగించవచ్చు. అయితే ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తుల పేర్లను యూజర్‌నేమ్‌గా అనుమతించబోమని కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్‌తో ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించదని, ముఖ్యంగా పెద్ద గ్రూపుల్లో చేరినప్పుడు వ్యక్తిగత గోప్యతకు మరింత రక్షణ లభిస్తుందని వాట్సప్ వాదిస్తోంది.
వివరాలు
సైబర్ నిపుణుల ఆందోళనలు ఏమిటి?
ఫోన్ నంబర్‌ను వెల్లడించకుండా చాట్ చేసే అవకాశాన్ని కల్పించే యూజర్‌నేమ్ ఫీచర్‌పై సైబర్ నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు లేదా ప్రజలకు తెలిసిన వ్యక్తుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్‌లు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశాన్ని ఈ ఫీచర్ పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే,గుర్తు తెలియని వ్యక్తులు యూజర్‌నేమ్‌లను అంచనా వేసి నేరుగా సందేశాలు పంపే అవకాశం ఉండటంతో స్పామ్ మెసేజ్‌లు, అనవసర సంప్రదింపులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఫోన్ నంబర్ గోప్యత పరంగా ఈ ఫీచర్ ఉపయోగకరమే అయినప్పటికీ, మోసాలను అరికట్టేందుకు బలమైన భద్రతా వ్యవస్థ లేకపోతే టెలిగ్రామ్‌లో కనిపిస్తున్న తరహా మోసాలకు వాట్సప్ కూడా వేదికగా మారే అవకాశం ఉందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.